11/9/16

ట్రంప్‌తో చైనాకు నష్టం... భారత్‌కు లాభం


Image result for ట్రంప్‌తో చైనాకు నష్టం... భారత్‌కు లాభం

న్యూఢిల్లీ : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారతీయ కాల్ సెంటర్‌ ఉద్యోగుల ఇంగ్లిష్ యాసను అనుకరించి ఎగతాళి చేశారు. ప్రసంగాల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానాలపై విరుచుకుపడ్డారు. వాణిజ్య అసమానతలను సరిచేస్తానని హెచ్చరించారు. అయితే ఆయన భారతదేశానికి వ్యతిరేకం కాదని, చైనా, పాకిస్థాన్లకే గట్టి సమస్యలు ఎదురవుతాయని అమెరికా దౌత్యవేత్త విలియం హెచ్. ఏవరీ అన్నారు.

చైనా, పాకిస్థాన్ దశాబ్దాలుగా అమెరికాను మెత్తని గోవును వాడుకున్నట్లుగా ఉపయోగించుకుంటున్నారని ఏవరీ చెప్పారు. చైనా అమెరికాలో భారీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని, పాకిస్థాన్ ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాటం పేరుతో 2002 నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం పొందుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ట్రంప్ చెప్తున్నదాన్నిబట్టి ఆయన ఈ రెండు దేశాలకు వెళ్తున్న నగదు ప్రవాహంలో కోత విధిస్తారని పేర్కొన్నారు.

అమెరికా 15 ఏళ్ళలో 50 లక్షల మాన్యుఫ్యాక్చరింగ్ జాబ్స్‌ను కోల్పోగా, చైనా మాన్యుఫ్యాక్చరింగ్ రంగం విపరీతంగా వృద్ధి చెందింది. కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకొస్తానని ట్రంప్ ప్రచారం చేశారు. షాంఘై నుంచి అమెరికా వెళ్ళే మెషినరీపై టారిఫ్‌ను విధించడం కన్నా హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కోడ్‌పై టారిఫ్ విధించడం కష్టమే. అయినప్పటికీ భారతదేశానికి కొంతవరకు నష్టం తప్పకపోవచ్చు. చైనాకు జరిగే నష్టం భారత్‌కు లాభంగా మారే అవకాశాలు ఉన్నాయని, ట్రంప్ అధ్యక్ష పాలనలో చైనాకు నష్టం జరగడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు.

భారతదేశానికి ఇబ్బందులు సృష్టిస్తున్న మరో దేశం పాకిస్థాన్ అని, ట్రంప్ పాలనలో పాకిస్థాన్‌కు భారీ నష్టం తప్పదని ఏవరీ చెప్పారు. పాకిస్థాన్ చాలా ప్రమాదకరమైన దేశమని ట్రంప్ అన్నారని తెలిపారు. భారతదేశాన్ని కలుపుకొనిపోవాలని, పాకిస్థాన్‌ను నిరోధించగలిగే దేశం భారతదేశమేనని అన్నారని చెప్పారు. త్వరలోనే తాను దీనిపై చర్చలు ప్రారంభిస్తానన్నారని తెలిపారు. ఎనిమిదేళ్ళ క్రితం బరాక్ ఒబామా మాట్లాడినపుడు కశ్మీరు అంశంలో అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందని చెప్పారు. కానీ ట్రంప్ పూర్తిగా పాకిస్థాన్‌కు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించడం గమనార్హం.

No comments: