11/9/16

ట్రంప్ గెలుపుతో పాక్‌లో ప్రకంపనలు

పాకిస్థాన్ భయపడుతోంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కంగారుపడుతోంది. అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్థాన్‌లోని ప్రముఖులు, విశ్లేషకులు ఆందోళనకు గురవుతున్నారు. తమ దేశం పట్ల ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తారని అంచనా వేస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష పాలన అనూహ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు హిల్లరీ క్లింటన్ డేగ వంటివారని కొందరు భావిస్తున్నారని, అయితే విద్వేషంతో, అసహనంతో ఉండేవారి కన్నా సవాలుతో కూడిన విధానాన్ని అవలంబించే హిల్లరీని ఎంచుకోవడం మంచిదని కొందరు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో జీహాదీలు, ఉగ్రవాదులతో ప్రభుత్వం ఘర్షణ పడుతున్న సమయంలో అసహనం ప్రదర్శిస్తున్న ట్రంప్ విజయం సాధించడం వల్ల పాకిస్థాన్‌కు ఇబ్బందులు తప్పవంటున్నారు. ట్రంప్‌కు ఉన్న ఇస్లామోఫోబియా వల్ల ఎదురయ్యే కష్టాలను అనుభవించక తప్పదని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. ఆయన జాత్యహంకార ధోరణి పట్ల పాకిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇదిలావుండగా పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ కొంతవరకు ఆశావాదంతో ఉన్నారు. ట్రంప్ దేశాధ్యక్షుడైతే దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయని చెప్తున్నారు. శాంతి స్థాపన కోసం ట్రంప్ కృషి చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు

No comments: