11/29/16

ఎన్ని చేసిన లంచం చావదు

ఒకప్పుడు ఒక రాజుగారు తన రాజ్యం లో అవినీతిని పూర్తిగా అంతమొందించాలని అనుకున్నాడు. ఎవరైనా లంచం ఇచ్చినా తీసుకున్నా శిరచ్చేదనం చేస్తానని ప్రకటించాడు. దాంతో ప్రజలు లంచాలు ఇవ్వడం, అధికారులు లంచాలు అడగడం మానేశారు. ఓ నెల తరువాత రాజుగారికి  వేగుల నించి సమాచారం వచ్చింది. అందరూ లంచాలు మానేశారు కానీ ఒక్క ఉద్యోగి మాత్రం ఇంకా లంచాలు అడుగుతున్నాడు అని చెప్పారు వాళ్ళు. రాజుకి చాల ఆశ్చర్యం వేసింది. అతనికి శిరచ్చేదం చేయకుండా ఎలాగైనా లంచం అడగడం మానిపించాలని అనుకుని, లంచాలు అడగడానికి ఎటువంటి అవకాశమూ లేని గంటలు కొట్టే ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు అతని పని గంటకి ఒక సారి ఠాణాలో గంటలు కొట్టడమే.
మళ్ళీ నెల తరువాత వచ్చిన వేగుల నివేదికలో అతను లంచం తీసుకోవడం మానలేదని వచ్చింది. ఆశ్చర్యపోయిన రాజు, అతనికి లంచం ఎవరు ఇస్తున్నారు అని అడిగాడు. వేగులు చెప్పడానికి సందేహిస్తుంటే, "ఫరవాలేదు చెప్పండి'' అని అడిగాడు.
వాళ్ళు కాసేపు తటపటాయించి, "సాక్షాత్తు మీ రాణులు ఇద్దరు ఇస్తున్నారు ప్రభు" అని విన్నవించారు.
అది ఎలాగా అని విచారించిన రాజుకి మతిపోయినంత పని అయింది.
అసలు సంగతి ఏమిటంటే రాజు గారు ఒక వారం పెద్ద రాణి అంతఃపురం లో, మరొక వారం చిన్న రాణి అంతఃపురం లో ఉంటాడు. వారాంతంలో మధ్యాహ్నం 12  గంటలకు అంతఃపురం మారతాడు అయన. ఇది తెలుసుకున్న ఆ ఉద్యోగి ఇద్దరు రాణులు దగ్గరికి వెళ్లి, రాజు గారు అంతః పురం మారే రోజున గంటని ఒక పది నిముషాలు ఆలస్యంగా కొడతానని పెద్ద రాణితో, పది నిముషాలు ముందు కొడతాను అని చిన్న రాణి దగ్గర చెప్పి, వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుని, గంట మాత్రం సరైన సమయానికే కొట్టడం మొదలు పెట్టాడు.
అతని ధైర్యానికి, తెలివికి ఆశ్చర్య పోయిన రాజు అతని కోసం ఒక కొత్త ఉద్యగం సృష్టించి అతనిని అక్కడికి పంపాడు. అతని ఉద్యోగం ఏమిటంటే సముద్రం ఒడ్డున కూచుని, సూర్యోదయం నించి సూర్యాస్తమయం దాక ఎన్ని అలలు ఒడ్డుకి వచ్చాయో లెఖ్ఖ పెట్టి రాజుగారికి చెప్పడం. ఇక ఇక్కడ అతనికి ఎవ్వరూ లంచం ఇవ్వరని అనుకున్నాడు అయన. కానీ ఆ ఉద్యోగి మాత్రం లంచం తీసుకోవడం మానలేదు. ఎలాగంటే, జాలర్లు పొద్దున్నే చేపల వేట కోసం సముద్రం లోకి వెళ్లి సాయంకాలానికి తిరిగివస్తుంటారు. ఈ ఉద్యోగి వాళ్ళను ఆపి, "రాజు గారి ఆజ్ఞ ప్రకారం వడ్డుకి అలలే రావాలి కానీ  పడవలు రాకూడదు" అని ఉత్తర్వులు చూపించి  వాళ్ళ దగ్గర లంచం తీసుంటున్నాడు. అది విన్న రాజుగారికి అవినీతిని అంతం చేయడం ఎంత కష్టమో తెలిసింది.



ఈ కథ చదవగానే మనం నిరాశ పడనవసరం లేదు. అవినీతిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న రాజు గారిని మెచ్చుకోవాలి. అవినీతి పూర్తిగా నిర్ములన కాకపోయినా లంచం తీసుకునే వారి సంఖ్య చాల వరకు తగ్గిపోయింది కదా.  నిదానంగా వాళ్ళు కూడా మార్చబడతారు. మనం కాస్త ఓపిక పట్టాలి అంతే.