ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలయ్యాయి. భారత్ సహా ప్రపంచ దేశాలు తమ దృష్టినంతా అటువైపు కేంద్రీకరించాయి. సాయంత్రం ఎనిమిది గంటల వరకు భారత్‌లో ఇదే హాట్ టాపిక్. ఎన్నికల్లో గెలుపెవరిది? ట్రంపా? హిల్లరీనా? అంటూ జోరుగా చర్చోపచర్చలు కొనసాగాయి. అయితే జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారన్న వార్త దేశాన్ని కాసేపు అటెన్షన్ చేసింది. ఏదో కీలక ప్రసంగం చేయబోతున్నారని భారతీయులు టీవీ సెట్ల ముందు అతుక్కుపోయారు. బహుశా పాకిస్థాన్‌పై ఏదో ప్రకటన చేయబోతున్నారని భావించారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన నల్లధనంపై యుద్ధం ప్రకటించారు. ఈ అర్ధరాత్రి నుంచి రూ.1000, రూ.500 నోట్లు రద్దు అవుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దీంతో దేశంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. నల్లకుబేరుల గుండెల్లో గుబులు మొదలైంది. మోదీ ప్రకటనపై సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది. ప్రధాని ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేశారు. ‘అమెరికాలో ఓట్ల లెక్క.. భారత్‌లో నోట్ల లెక్క’ అని కామెంట్లు చేస్తూ అవినీతిపై ప్రధాని పోరాటానికి మద్దతు పలికారు. ‘Americans counting votes.. Indians counting notes’ అనే మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. . సాయంత్రం ఎనిమిది గంటల నుంచి సోషల్ మీడియాలో ఈ చర్చ తప్ప మరో చర్చ లేదనడం అతిశయోక్తి కాదు.
No comments:
Post a Comment