11/10/16

శతకోటి బ్లాక్‌లకు.. అనంతకోటి ఆఫర్లు...


దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దుతో కలకలం చెలరేగింది. నల్లకుబేరులు ఇప్పడు తెల్లమొహాలు వేశారు. గుట్టలకొద్దీ ఉన్నబ్లాక్ మనీ చెల్లడం ఎలా అంశంపై దృష్టి పెట్టారు. చలామనికి ఉన్న మార్గాలన్నింటిని వెతుకుతున్నారు. ఇన్నాళ్లు నల్లధనాన్ని అంటిపెట్టుకుని మురిసిపోయినవాళ్లు, ఇప్పుడు తెల్లమొహాలు వేశారు. ఇప్పటి వరకు చెలామణి అయిన బ్లాక్ మనీ సంగతి సరే.. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఉన్న నల్ల ధనంలో సగం అయినా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమకు పరిచయస్తులు, తెలిసినవాళ్లకు ఎర వేస్తున్నారు. తమ వద్ద పనిచేసే వాళ్లకు, పరిచయస్తులకు ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. తమకు సేవ చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి చిన్నా చితక ప్రయత్నాలు చేస్తూనే పెద్ద మొత్తంలో నగదు మార్పిడి ఎలా అన్న కోణంలోనూ ఆలోచన చేస్తున్నారు. ఆర్థిక నిపుణులను ఆశ్రయిస్తున్నారు. బ్లాక్ మనీ మార్పిడిలోనూ రియలిస్టేట్ వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అప్పటికప్పుడు భూములు కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించుకుంటున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ కోసం పాత తేదీలతో ఒప్పంద పత్రాలు రాయించుకుని అడ్వాన్స్‌లు ఇచ్చామని చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ విధంగా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. కమీషన్ ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో కొందరు బ్లాక్ మనీ చెలామనిలో భాగస్వాములు అయ్యేందుకు అంగీకరిస్తున్నారు. లోన్ క్లియర్ చేయడం చట్ట బద్ధమైన వ్యవహారం కావడంతో, బ్యాంకుల నిబంధనలు కూడా ఒప్పుకునే అవకాశం ఉండడంతో చాలామంది ఈ తరహా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ రకంగా చాలామంది లోన్లు తీసుకున్నవారు క్లియర్ చేస్తామంటూ గురువారం నగరంలోని కొన్ని బ్యాంకుల్లో వినియోగదారులు బారులు తీరారు. దీంతో బ్యాంక్ అదికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం వారిని అడ్డుకోలేమని చెబుతున్నారు.

No comments: