11/10/16

ట్రంప్ అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు?


అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడవుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. హోరాహోరీ పోరులో హిల్లరీ క్లింటనే ఎక్కువగా ముందంజలో కనిపించారు. సర్వేలు కూడా ఆమె వైపే మొగ్గు చూపాయి. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేలోను హిల్లరీకి 90 శాతం అనుకూలం కనిపించింది.
కానీ ఫలితాలు మాత్రం ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. చాలా కొద్ది మంది మాత్రమే ట్రంప్ గెలుస్తారని భావించారు. కానీ ఎక్కువ మంది అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌ది 324వ స్థానం. అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు. ఇటీవల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జున్‌ 14, 1946న ఫ్రెడ్‌ ట్రంప్‌, మేరీ అన్నా మెక్‌లాయిడ్‌ దంపతులకు రెండో సంతానంగా ట్రంప్‌ న్యూయార్క్‌లో జన్మించారు. ట్రంప్‌ తండ్రి మూలాలు జర్మనీలో, తల్లి మూలాలు స్కాట్లాండ్‌లో ఉన్నాయి

ట్రంప్ అమెరికాలో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్‌ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్‌ స్కూల్‌ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్‌ ట్రంప్‌ అండ్‌ సన్స్‌లో పని చేసేందుకే ఇక్కడ చదివారు. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాక్ మార్కెట్‌ను, న్యూయార్కులో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందట.


ఆయన పైన బ్యాంకుల అప్పుల ఎగవేత మరకలు ఉన్నాయి. 1971లో కుటుంబ సంస్థ ఎలిజబెత్ అండ్ సన్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1971లో వ్యాపార పగ్గాలు చేపట్టగానే దానిపేరును ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చారు. పలు ప్రముఖ భవనాలు ఆయన నిర్మించారు. ట్రంప్ ఆరుసార్లు దివాళా తీసినట్లుగా తెలుస్తోంది. తాను దివాళా చట్టాలతో ఆడుకుంటానని, అవి తనకు మంచి చేశాయని ట్రంప్ ఓసారి అన్నారు.
ట్రంప్ అందాల పోటీలు కూడా ప్రమోట్ చేశారు. ఎక్కువ సార్లు మిస్‌వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ పోటీలను ప్రమోట్‌ చేసిన వ్యక్తిగా నిలిచారు. 2006 మిస్‌ అమెరికా విన్నర్ కొకైన్‌ వాడిందని తెలిసినా ఆమెను విజేతగా కొనసాగించాలనే ట్రంప్‌ నిర్ణయం విమర్శలపాలైంది. ఈ పోటీ పక్షపాతంతో కొనసాగిందని పోటీలో పాల్గొన్న యువతి ఆరోపించింది. దీంతో ఆమెపై కేసు వేసి ట్రంప్‌ ఐదు మిలియన్‌ డాలర్లను రాబట్టారు.
2015లో ఎన్‌బీసీలో వాటాలు కొనుగోలు చేసి, తాను యజమానిని అని ప్రకటించారు. అది వివాదాస్పదం కావడంతో వాటాలు అమ్మేశాడు. సామాజిక కార్యక్రమాల కోసం ఫౌండేషన్ నెలకొల్పడం, వివాదాస్పదం కావడం కూడా జరిగాయి. ప్రధానంగా ఇతను పన్ను ఎగవేతదారుడిగా పేరుగాంచారు.
రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే తొలుత రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలికారు. తర్వాత రిఫార్మ్ పార్టీకి మారారు. అనంతరం డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఏడేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు. అనంతరం రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షులు అయ్యారు. అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించారు. 1988, 2004, 2012లలో ప్రయత్నించారని అంటారు.

No comments: