11/20/16

భారత, చైనా సంబంధాల్లో పాకిస్థాన్‌ పాత్ర ఏమిటి

అభివృద్ధి, సంస్కరణలు వంటి అంశాల్లో దూసుకుపోతోంది. అగ్రరాజ్యంగా, అణ్వస్త్రదేశంగా ఎదగడానికి భారత్‌కు ఎంతో కాలం పట్టకపోవచ్చు. అయితే, ఇది ఒకటి రెండు పొరుగు దేశాలకు నచ్చని విషయం. ప్రభుత్వం అభివృద్ధి పథంలో ప్రయాణించడం కాక, ఇంటా బయటా సమస్యలతో సతమతం కావాలన్నది పొరుగున ఉన్న శత్రు దేశాల ఉద్దేశం. భారతదేశం ఎప్పుడూ ముప్పులు, ప్రమాదాల్లో మనుగడ సాగించాలి తప్ప, అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకూడదు. భారతదేశానికి ఎటువంటి ప్రాధాన్యం, ఎటువంటి ప్రాముఖ్యం ఉండకూడదు. ఇదీ పాకిస్థాన్ వంటి కొన్ని శత్రుదేశాల ఆలోచన. దేశంలో ఆశావహ పరిస్థితి ఏర్పడినప్పుడల్లా భారతీయులను భయాందోళనల్లో ముంచెత్తే కార్యకలాపాలు సరిహద్దుకు అవతలివైపు నుంచి ఊపందుకుంటాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఇదే వ్యూహాన్ని చాలా కాలంగా అనుసరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇటీవల సర్జికల్‌ దాడులు జరిగాయి. సర్జికల్‌ దాడులకు ముందు, ఆ తరువాత భారతీయులు స్పందించిన తీరు వారికి పాకిస్థాన్ పట్ల ఉన్న ద్వేష భావానికి అద్దం పట్టింది.


చైనా మాదిరిగా కాకుండా పాకిస్థాన్ మొదటి నుంచీ భారత్‌కు ప్రత్యక్ష శత్రువే. వాఘా సరిహద్దుల దగ్గర దాదాపు ప్రతి రోజూ భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వాలు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి భారతదేశం సునాయాసంగా పాకిస్థాన్‌ను పరాజయం పాలు చేయగలదని ప్రతి భారతీయుడికీ గట్టి నమ్మకం. అయితే చైనా విషయంలో అటువంటి నమ్మకం ఎవరికీ లేదు. 1962లో చైనా ఒకసారి భారత్‌ను పరాజయం పాలు చేసింది. ఉగ్రవాదం మినహా దాదాపు పాకిస్థాన్‌కు సమానంగా భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతున్న చైనాను కాకుండా పాకిస్థాన్‌ను మాత్రమే పాలకులు, ప్రజలు బద్ధ శత్రువుగా భావించడం విచిత్రమే. వాస్తవానికి, చైనా మద్దతు కారణంగానే పాకిస్థాన్‌ ఓ ఉగ్రవాద దేశంగా కొనసాగగలుగుతోంది.

నిజానికి, పాకిస్థాన్‌ విషయంలో కంటే, చైనా విషయంలోనే భారత్ అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఇటీవలి కాలంలో భారత్-చైనాల సంబంధాలు మారుతున్న తీరును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, భారతకు ప్రధాన శత్రువు చైనాయేనని కచ్చితంగా నిర్దారణ అవుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా, బంగ్లాదేశ ద్వారా భారతను చుట్టు ముట్టడానికి చైనా ప్రయత్నాలు సాగిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశపై తరచూ ఆకస్మిక దాడులు కొనసాగిస్తుంటుంది. భారత అణు సరఫరాదార్ల గ్రూప్‌లో చేరకుండా మోకాలు అడ్డుతుంటుంది. ఉగ్రవాదం మినహా అనేక కొత్త ఎత్తుల ద్వారా భారత్‌ను వేధించడం చైనాకు పరిపాటి అయిపోయింది. చైనా ఎన్ని రకాలుగా వేధిస్తున్నా భారత నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. చైనాను ఎదుర్కోవడం భారతకు అంత తేలికైన విషయం కాదు. చైనాను ఎదుర్కోవడానికి భారత్ తప్పనిసరిగా దౌత్యపరమైన మార్గాలనే ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆధిపత్య కాంక్ష ఎక్కువ

వాస్తవమేమిటంటే, సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం ఎన్నటికీ జరగకపోవచ్చు. యథాతథ పరిస్థితితో శాంతిని కొనసాగించాలన్న ఉద్దేశం చైనాకు ఏ కోశానా లేదన్నది కాదనలేని సత్యం. పరిష్కారం విషయంలో ఈ దేశాలకు భిన్నాభిప్రాయాలున్నాయి. చైనాకు బలం, బలగం కాస్తంత ఎక్కువ. ఈ రెండు దేశాల మధ్యా యుద్ధమంటూ జరిగితే, 1962 నాటి కంటే ఇప్పుడు భారత్‌ కాస్తంత మెరుగైన స్థితిలో ఉంటే ఉండొచ్చు. అయితే, చైనాను నిరోధించడంలో దీర్ఘకాలిక వ్యూహమంటూ భారత్‌కు ఏమీ లేదు. అంటే, చైనాతో తలపడటమంటే, భారత్‌కు చైనా ఏం కోరుకుంటున్నదీ తెలియాలి. భారత్‌కు ఏం అవసరమో తెలియాలి. వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలో భారత, చైనా అధికార సమీకరణాలు ఏ విధంగా ఉండబోతోన్నాయో కూడా అంచనా వేయాలి. అసలు చైనా ఇలా ఎందుకు చేస్తుందో కూడా ఓ మారు సింహావలోకనం చేయాలి.

చైనాకు ఇంకా అనేక కోరికలున్నాయి. ఆసియాలో తమ పెత్తనమే సాగాలని చైనా ఉద్దేశం, లక్ష్యం. ఆసియాలో తామే పెద్ద దిక్కుగా ఉండాలని, మిగిలిన దేశాలన్నీ తమకు అణగిమణగి ఉండాలని కూడా చైనా భావిస్తోంది. చైనా ఆధిపత్యాన్ని అంగీకరించే దేశాల మీద అది వరాల వర్షం కురిపిస్తోంది. దక్షిణ చైనా సముద్రం మీదే కాక, అక్కడి అన్ని సముద్ర మార్గాలూ తమ అధీనంలోనే ఉండాలని, చైనా తీరంలోని సముద్ర గర్భ వనరులన్నీ తమకే చెందాలని కూడా అది ఆశిస్తోంది. ఇటువంటి కోరికలు ఉంటే మిగిలిన ఆసియా దేశాలతో కూడా వివాదాలు తలెత్తవచ్చు. కానీ, మొత్తం ప్రపంచం తమకు శత్రువుగా మారినా, తమకు కావాల్సిందాన్ని చేజిక్కించుకోవడమే చైనా లక్ష్యం. తమకు కావాల్సింది సాధించుకోగలమనే నిశ్చితాభిప్రాయం ఆ దేశానికి ఉంది. అందుకనే అది జపాన్‌-వియత్నాం- భారత్‌లు ఒక్క తాటి మీదకు రాకుండా చేయగల ప్రయత్నమంతా చేస్తోంది.

ఇది ఆసియాలో ఆ దేశ రాజకీయ లక్ష్యం. కానీ, భారత ఉపఖండంలో మాత్రం అది మూడు లక్ష్యాల కోసం ప్రయత్నిస్తోంది. లడఖ్‌లో మరిన్ని ప్రాంతాలు దాని అధీనంలోకి రావాలి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా వెళ్లి, హిందూమహా సముద్రంలో నౌకాయానం సాగించుకోవడానికి, త్వరగా టిబెట్‌కు చేరడానికి ఓ అవకాశం కోసం అది ఎదురు చూస్తోంది. అందుకనే అది సియాచిన్‌ నుంచి భారత్‌ తప్పుకోవాలని కోరుకుంటోంది. సియాచిన్‌ను రక్షణ దళాల నుంచి విముక్తం చేయాలని పాకిస్థాన్‌ ద్వారా ప్రయత్నాలు సాగిస్తోంది. టిబెట్‌ తరువాత అతి పెద్ద ఆరామాలు కలిగి ఉన్న తవాంగ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలి. అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌ మొత్తాన్నీ తమ అఽధీనంలోకి తీసుకురావాలి. అంటే చైనా నిబంధనలకన్నిటికీ భారత్‌ ఒడంబడిక ఉండాలి. సరిహద్దు సమస్యను తమకు అనుగుణంగా పరిష్కరించుకోవడానికి చైనా చాలా కాలంగా ఒత్తిడి తెస్తోంది. భారత్‌ సరిహద్దులోని నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, మాల్దీవుల్లో అది భారీయెత్తున నిర్మాణాలు, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఇదే కారణం.

పాకిస్థాన్ పాత్ర ఏమిటి?

భారత, చైనా సంబంధాల్లో పాకిస్థాన్‌ పాత్ర ఏమిటి? భారత ఉపఖండంలోని చిన్నా చితకా దేశాలను ‘ముత్యాల సరం’ పేరుతో తమ వైపుకు తిప్పుకుంటున్న చైనా పాకిస్థాన్‌ను కూడా తమ ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. భారత్‌ నుంచి దేన్ని సాధించుకోవాలన్నా పాకిస్థాన్‌ను ప్రేరేపించడం చైనాకు మొదటి నుంచీ అలవాటు. దానివల్ల చైనా నుంచి పాకిస్థాన్‌ కొన్ని ప్రయోజనాలు పొందుతుంటుంది. అంతమాత్రాన పాకిస్థాన్‌ చైనాకు మిత్రదేశం కాదు. పాకిస్థాన్‌ అంటే చైనాకు ఏమాత్రం గౌరవం లేదు. పాకిస్థాన్‌తో ఎప్పటికైనా తమకు ప్రమాదమేనని చైనా అధినేతలు తరచూ చెబుతుంటారు. భారత్‌ను చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి మాత్రమే ఆ దేశం పాకిస్థాన్‌ను ఉపయోగించుకుంటుంటుంది. భారత్‌ విషయంలో తమ లక్ష్యం నెరవేరాక, ఆ తరువాత పాకిస్థాన్‌ను లొంగదీసుకోవడం తేలిక. దాని స్థితిగతుల్ని తేలికగా మార్చేయొచ్చు. పాకిస్థాన్‌ కూడా కొన్ని ప్రయోజనాల కోసం చైనా మీద ఆధారపడి, అది చెప్పినట్టు ఆడుతోంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు నిలయం అని ప్రపంచ దే శాలకన్నిటికీ తెలుసు. అది ఏదో ఒక రోజున పాకిస్థాన్‌కు ముప్పు తెస్తుంది. ఆ ముప్పును తప్పించుకోవడానికి పాకిస్థాన్‌ చైనాను ఆశ్రయిస్తుంటుంది. ఇక్కడ సమస్యేమిటంటే, చైనా దేశానికి పాకిస్థాన్‌ ఇలా తొత్తుగా ఉన్నంత కాలం పాకిస్ధాన్‌ భారత్‌కు శత్రు దేశంగానే కొనసాగుతుంది.

చైనా ఎంత వేధించినా భారత్ తన అభివృద్ధి కార్యక్రమాల మీదే దృష్టి కేంద్రీకరించడం అవసరం. చైనాను భారత్ ఎదుర్కోవాలంటే చైనా స్థాయిలో అభివృద్ధి చెందడమే సరైన మార్గం. అరుణాచల్‌ ప్రదేశలోని తవాంగ్‌పై చైనా ఎన్నిసార్లు దాడులు చేసినా భారత్ తన దృష్టిని అభివృద్ధి నుంచి మళ్లించకూడదు. మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టుగా ఉండాలి. అగ్ర రాజ్యమనో, అణ్వస్త్ర దేశమనో ఊరికే గొప్పలు చెప్పడం వల్ల చైనా అహాన్ని రెచ్చగొట్టడం తప్ప ఉపయోగం ఉండదు. అగ్ర రాజ్యంగానో, అణ్వస్త్ర దేశంగానో భారత్ ఎదిగితే, ప్రపంచం భారత్ చెప్పకుండానే గుర్తిస్తుంది. భారత్‌కు మళ్లీ చైనాతో యుద్ధం వస్తుందా? రాకపోవచ్చు. భారత్‌ బలహీన దేశమని చైనా దృఢ నిశ్చయానికి వచ్చినప్పుడే ఆ దేశం భారత్‌పై దాడి చేస్తుంది. అధికారం, శక్తి ఉన్న దేశాన్ని మాత్రమే చైనా గౌరవిస్తుంది. భారత్‌ నిలకడగా తన ఆర్థిక, సైనిక సత్తాను పెంచుకుంటూ పోతేనే చైనా తన హద్దుల్లో తానుంటుంది.

భారతీయులు చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, అమెరికా వంటి దేశాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. భారత ఉక్కు రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందనే వాస్తవాన్ని చైనా గుర్తించింది. తన ఉక్కు ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉందని అది తరచూ ఆందోళన చెందుతోంది. అంతేకాదు, స్మార్ట్‌ ఫోన్లు, ఆట వస్తువుల ఉత్పత్తిలో భారత్ కూడా చైనా స్థాయిలో ముందుకు దూసుకుపోతోంది. భారత్ తన వ్యూహాన్ని మరికాస్త పకడ్బందీగా ముందుకు తీసుకువెడితే, ఈ రంగాల్లో కూడా భారత్ అపార విజయం సాధించగల స్థాయిలో ఉంది. వివిధ దేశాలు తమమీద ఆధారపడి ఉండేందుకే చైనా అంతర్జాతీయ మార్కెట్లను తన గుప్పిట్లో బంధించే ప్రయత్నం చేస్తోంది. వివిధ రంగాల్లో చైనాతో సమానంగా భారతకూ సహజ వనరులు, వసతులు, సౌకర్యాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. చైనాతో సరిహద్దుల్లో ఉన్న లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి భారత కృషి చేయగలిగితే, చైనా దూకుడును కొంత వరకూ అరికట్టవచ్చు.


No comments: