11/17/16

నోట్ ల రద్దు ఫై కెసిఆర్ సపోర్ట్


రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై నిన్నటి వరకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మెత్తబడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ సమూల ప్రక్షాళన కోసం ఉపయోగపడితే ప్రధానినరేంద్ర మోదీ నిర్ణయానికి మద్దతిస్తానన్నారు. ఢిల్లీలో విపక్షమంతా ఏకతాటిపై నిలిచి ప్రభుత్వంపై యుద్ధం చేస్తుండగా ఆ ఆందోళనకు దూరంగా ఉండాలని కేసీఆర్‌ గురువారం ఉదయం తన పార్టీ ఎంపీలను ఆదేశించారు. కీలకమైన రాజ్యసభలో టీఆర్‌ఎ్‌సకు ముగ్గురు సభ్యులున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం కేసీఆర్‌-ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని వివరించారు. ఇదే సమయంలో కేంద్రం సాయం తగ్గడం గురించీ ప్రస్తావించారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెద్దనోట్ల రద్దుతో కుదేలయ్యే పరిస్థితి నెలకొందని నివేదించారు. భూముల రిజిసే్ట్రషన పూర్తిగా మందగించిందని తెలిపారు. ప్రధానిది చరిత్రాత్మక నిర్ణయమంటూనే ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో కొత్తనోట్లు విడుదల చేసి ఉండాల్సిందన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఆత్మహత్యలు, ఆకస్మిక మరణాలను వివరించారు. తెలంగాణకు ఏటా రూ.12 వేల కోట్ల పైగా నష్టం జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆవేదనకు సానుకూలంగా స్పందించిన ప్రధాని అభిప్రాయాలు, సూచనలతో శుక్రవారం ఢిల్లీకి రావాలని సూచించారు. దాంతో సీఎం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానితో భేటీ శనివారం ఉదయం జరిగే అవకాశాలున్నాయి. ప్రధానితో సీఎం ఫోన్లో మాట్లాడిన అనంతరం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళనకు దోహదపడితే ప్రధాని నరేంద్ర మోదీకి తప్పకుండా మద్దతిస్తానని సీఎం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఆ ప్రకటన ప్రకారం... సంస్కరణలు కొనసాగి తీరాలని, అవి ఉన్నత స్థాయికి పురోగమించాలని సీఎం ఆకాంక్షించారు. ఆలోచనాపరులు, మేధావులు కలిసి పనిచేస్తే ఏదైనా తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు.


నల్లధనం నిర్మూలించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత వ్యాపారులు నష్టపోకుండా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా ప్రజలను పరిగణనలోకి తీసుకోవాలని, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. శనివారం ప్రధానితో సమావేశంలో సీఎం తన అభిప్రాయాలు, సూచనలతో సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. ఇన్‌పుట్స్‌ కోసం సీఎం పలుదఫాలుగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాలపై చర్చించారు. అంతకు ముందే సీఎస్‌ రాజీవ్‌శర్మ కీలకమైన వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. కరెన్సీ రద్దు ప్రభావంపై రోజూవారీగా శాఖలన్నీ సమీక్షలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ప్రతీ రోజూ అధికారులు సమీక్ష చేస్తున్నారు. ప్రధాని 25న హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ మరోమారు భేటీ కానున్నారు.


2.5 లక్షలు దాటినా బ్లాక్‌ మనీ కాదు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని అంచనా వేసేందుకు సీఎం... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్‌ అధికారులు ప్రదీ్‌పచంద్ర, ఎంజీ గోపాల్‌, ఎస్‌కే జోషి, ఎస్పీ సింగ్‌, నర్సింగ్‌రావు, శాంతికుమారి, చంద్రవదన, సునీల్‌శర్మ, సందీప్‌ సుల్తానియా, రామకృష్ణారావు, నవీన మిట్టల్‌, స్మితా సభర్వాల్‌, భూపాల్‌రెడ్డి, అదర్‌ సిన్హా తదితరులతో సమీక్ష జరిపారు. ప్రధాని నిర్ణయానికి అనుకూలంగా, ప్రతికూలంగా వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలోని లోటు పాట్లను సవరించడానికి, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడితే తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిందేనన్నారు. సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగంలో ఉన్నవారు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. రూ.2.50 లక్షలు దాటిన వాళ్లను బ్లాక్‌మనీ దాచిన వాళ్లుగా కాకుండా లెక్కలోకి రాని నగదు(అన అకౌంటెడ్‌ మనీ) కలిగి ఉన్న వారిగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్యతరగతికి ఇబ్బంది కలుగకుండా చూడాలని, అవసరమైతే వారికి మద్దతు కూడా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అసంఘటిత, చిల్లర వ్యాపారం చేసుకునేవారికి కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేయాలని అన్నారు. ఈ అంశాలను తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సీఎం వెల్లడించారు. రిజిసే్ట్రషన్లు, ట్రాన్సపోర్టు విభాగాల్లో ఆదాయం బాగా తగ్గిందని, ఎక్సయిజ్‌, సేల్స్‌ట్యాక్స్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగాలపైనా ప్రభావం పడినట్లుగా సమీక్షలో అంచనాకు వచ్చారు. నెలన్నర గడిస్తేగానీ నష్టంపై స్పష్టమైన అంచనాకు రాలేమని అధికారులు సీఎంకు వివరించినట్లు సమాచారం. ఎగవేతదారుల రుణాలను మాఫీ చేస్తూ ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంపై టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇది సరైన సమయం కాదని, ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఎలా అనుమతి ఇచ్చిందో అర్థం కావటంలేదని పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల కూరగాయలు, ఎక్కువ కాలం నిల్వ ఉండని ఆహార పదార్థాల ధరలు పడిపోతున్నాయనే ఫీడ్‌బ్యాక్‌ క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వానికి అందుతోంది. ఉత్పత్తిదారులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని సర్కారు గుర్తించింది. ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండటం ప్రభుత్వ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్లోకి రూ.20 మొదలు రూ.500 వరకు పెద్దఎత్తున నగదు చలామణిలోకి వస్తేనే పరిస్థితి కుదుటపడుతుందని వారు అంచనా వేస్తున్నారు.

No comments: