11/14/16

ఫ్రీగా ఫోన్లు!

పెద్ద నోట్ల రద్దు ప్రభావం మొబైల్ ఫోన్ రిటైలర్ల‌పైనా పడింది. ప్రజలు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ములను వ్యక్తిగత అవసరాల కోసం వారివద్దే అట్టిపెట్టుకోవడంతో మొబైల్ ఫోన్లు కొనేవారే కరువయ్యారు. వారం రోజులుగా అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు మొబైల్ వ్యాపారులు జీరో డౌన్‌పేమెంట్ ఆఫర్లు మొదలు పెట్టారు. ఈ ఆఫర్‌తో వారం రోజులగా ఏటీఎంల వద్ద దర్శనమిస్తున్న క్యూ లైన్లు ఇప్పుడు మొబైల్ షాపుల వద్ద కూడా కనిపిస్తున్నాయి. ‘‘శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ఆఫర్ ప్రారంభించాం. తర్వాత 12 నెలల పాటు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చుని చెబుతున్నాం’’ అని సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర పేర్కొన్నారు.

గీత మొబైల్స్‌కి దక్షిణాది రాష్ట్రాల్లో 300 పైగా మొబైల్ స్టోర్లు ఉన్నాయి. సాధారణంగా ఫోన్ ధరలో కొంత భాగం చెల్లించిన తరువాత మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా విడతల వారీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు రూపంలో చెల్లింపులు స్వీకరిస్తారు. అయితే దాదాపు 30 నుంచి 40 శాతం అమ్మకాలు నగదు రూపంలో జరుగుతుంటాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తగ్గటంతో ముందస్తు చెల్లింపులు లేకుండా రిటైలర్లు ఫోన్ల అమ్మకాలు చేపట్టారు. తాజా ఆఫర్‌తో అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయనీ... ఫోన్లు మొదలు పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని సతీష్ చంద్ర పేర్కొన్నారు.

No comments: