11/14/16

ప్రధాని మోదీ భావోద్వేగ విన్నపం

నన్ను ప్రాణాలతో ఉండనివ్వరేమో!.. ఐనా జంకను
నిలువునా దహించినా.. నల్ల ధనంపై పోరు ఆపను!
దేశం కోసం ఓపికపట్టండి.. 50 రోజుల్లో ఫలితాలు
నా నిర్ణయంలో దురుద్దేశం ఉందని తేలితే.. క్షమించకండి!
ప్రధాని మోదీ భావోద్వేగ విన్నపం
పెద్దనోట్ల రద్దు అంతంకాదు... ఆరంభమే!.. మున్ముందు మరిన్ని చర్యలు
బినామీ ఆస్తుల గుట్టూ రట్టు చేస్తా.. 70 ఏళ్ల అవినీతి చరిత్ర తవ్వితీస్తా
నిజాయితీపరులను ఇబ్బందిపెట్టం.. అవినీతిపరులెవ్వరినీ వదిలిపెట్టం
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు నిజమే.. ఇది అహంకార నిర్ణయం కాదు
గద్దెపైకెక్కేందుకు పుట్టలేదు.. దేశం కోసం సర్వం వదిలేశాను: ప్రధాని
జపాన్‌లో నవ్వాడు.. గోవాలో ఏడ్చాడు.. ఇదీ ప్రధాని తీరు: రాహుల్‌
ఇది భావోద్వేగ బ్లాక్‌మెయిలింగ్‌: కేజ్రీవాల్‌, మాయావతి, రాజా


‘‘పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతుండటం నిజమే. ఇది నన్ను కూడా కలచి వేస్తోంది. నాకూ బాధగానే ఉంది. అయితే ఇది నేను అహంకారంతో తీసుకున్న నిర్ణయంగా భావించకండి. ఇలాంటి ఇబ్బందులు డిసెంబరు 30 వరకే. ఆ తర్వాత అంతకంటే ఎక్కువే లబ్ధి చేకూరుతుంది. ఒక్కసారి ‘ప్రక్షాళన’ ముగిసిందంటే... చిన్న దోమ కూడా ఉండదు! ఐదొందల నోటును మూడొందలకో, ఇంకా తక్కువకో మార్చుకోవద్దు. అది మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. నోట్ల రద్దుపై సామాన్యులకు భయాందోళనలు వద్దు.’’


పణాజీ/బెలగావి, నవంబరు 13: ‘‘ఇది అంతం కాదు... ఆరంభమే! 70 ఏళ్ల అవినీతి చరిత్ర మొత్తం బయటికి తీస్తా! ఎవ్వరినీ వదిలేది లేదు! ఇంతటితో ఆగేదీ లేదు. మున్ముందు ఇంకా ఇలాంటి చర్యలు చాలానే ఉంటాయి’’... ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విస్పష్టమైన ప్రకటన! పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన విరుచుకుపడ్డారు. ఎవ్వరి పేరెత్తకుండానే... ఎవరిని ఉద్దేశించి అంటున్నదీ అందరికీ అర్థమయ్యేలా చురకలు అంటించారు. ఆవేశం, ఆగ్రహంతోపాటు పలుమార్లు తీవ్ర భావోద్వేగానికీ గురయ్యారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘డిసెంబరు 30వ తేదీ వరకు వేచి చూడండి. నా నిర్ణయం, నా చర్యల వెనుక దురుద్దేశం ఉందని భావిస్తే... నడి వీధిలో ఉరి తీయండి. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బంది నాకు తెలుసు. దయచేసి 50 రోజులపాటు నా కోసం, దేశం కోసం ఓపికపట్టండి. ఆ తర్వాత... ఈ ప్రక్షాళన ఫలితాలు మీకు లభిస్తాయి. మీరు కోరుతున్న భారతాన్ని మీకు అందిస్తాను’’ అని మోదీ ప్రకటించారు.

ఆదివారం ఆయన గోవాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన, కర్ణాటకలోని బెళగావిలో కర్ణాటక లింగాయత విద్యా సంస్థ వందేళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. రెండు చోట్లా నోట్ల రద్దు గురించి ప్రస్తావించారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బ్యాంకులో క్యూలో నిలబడి నాలుగు వేలు తీసుకున్న సంగతిని పరోక్షంగా గుర్తు చేస్తూ... ‘‘బొగ్గు స్కామ్‌, 2జీ స్కామ్‌లాంటి భారీ కుంభకోణాల్లో ప్రమేయమున్న వారు నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిల్చున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘‘కొన్ని శక్తులు నన్ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయని తెలుసు. ఎందుకంటే, 70 ఏళ్లపాటు వాళ్లు దోచుకున్న సొమ్ముకు ఇప్పుడు ముప్పు వచ్చి పడింది. వాళ్లు నన్ను ప్రాణాలతో ఉండనివ్వక పోవచ్చు. ఏం జరిగినా సరే, ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. ప్రియమైన ప్రజలారా... నేనేం ఉన్నత పదవులు అలంకరించేందుకు పుట్టలేదు. ఈ దేశం కోసం నా ఊరిని, నా కుటుంబాన్ని, నా సర్వస్వాన్ని త్యాగం చేశాను’’ అని తీవ్ర భావోద్వేగంతో అన్నారు.

కొన్ని లక్షల మంది అవినీతి పరులు మినహా... మిగిలిన దేశవాసులంతా తన పోరాటాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ‘‘నిజాయితీపరులను ఇబ్బందిపెట్టం. అదే సమయంలో... అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదు. ఇది 70 ఏళ్లుగా ఉన్న జబ్బు. దీనిని నయం చేసేందుకు 17 నెలలుగా ప్రయత్నిస్తున్నాం. 70 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్నారు. ఇన్నేళ్లపాటు మీరు దోపిడీదారులను చూశారు. దీనిని చక్కదిద్దేందుకు 70 నెలలు సమయం ఇవ్వండి. మొత్తం అవినీతి చరిత్రను వెలికి తీస్తా. దీనికోసం లక్ష మంది యువతను నియమించాల్సి వచ్చినా వెనక్కి తగ్గను. పెద్దనోట్ల రద్దు అనేది మొదటి అడుగు మాత్రమే. అది అంతం కాదు... ఆరంభం. నన్ను గట్టిగా నిలదీస్తే మౌనంగా ఉంటానని భావిస్తున్నారు. కానీ... నన్ను సజీవంగా దహనం చేసినా సరే... భయపడను. దీనిని వదిలిపెట్టేది లేదు. దేశాన్ని అవినీతి రహితం చేసేందుకు ఇంకా చాలా ప్రాజెక్టులున్నాయి. బినామీ ఆస్తులపైనా చర్యలు తీసుకుంటాం. దేశంలో దోపిడీకి గురైన, దేశం సరిహద్దులు దాటి వెళ్లిన సొమ్ము మొత్తం రాబట్టి తీరుతాం.

ఇది మా బాధ్యత’’ అని ఉద్ఘాటించారు. ఇప్పటికైనా కట్టలు కట్టలుగా సొమ్ములు దాచుకున్న వారు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. ‘‘ఇప్పటికీ ఇంకా వేచి చూద్దాం అని అనుకునే వాళ్లకు నా గురించి తెలియదు’’ అని హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దు పర్రీకర్‌ చేసిన దాడి (పాక్‌పై చేసిన సర్జికల్‌ ఎటాక్‌)లాంటిది కాదని మోదీ చెప్పారు. ‘పది నెలల కిందట చిన్న టీమ్‌తో ఈ సీక్రెట్‌ ఆపరేషన్‌ మొదలైంది’ అని తెలిపారు. కొత్త నోట్ల ముద్రణకు, ఇతర చర్యలకు చాలా కసరత్తు జరిగిందని తెలిపారు. అదే సమయంలో... ఈ మొత్తం ప్రక్రియను గోప్యంగా ఉంచామని, లేకపోతే అవినీతిపరులు అప్రమత్తమయ్యే వారని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ పావలా నాణేల రద్దుతో సరిపెట్టిందని, వాళ్ల సత్తా అక్కడికే పరిమితమని ఎద్దేవా చేశారు. ‘500, వెయ్యి నోట్లు ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్‌ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మీరు పావలా నాణేలు రద్దు చేసినప్పుడు మేం ఏమైనా అన్నామా?’ అని ప్రశ్నించారు.
జనం అడిగిందే చేస్తున్నాం

‘‘అవినీతిపై దేశం విసిగి వేసారిపోయింది. 2014 ఎన్నికల్లో జనం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నారు. ఈ దేశ ప్రజలు నన్ను ఏం అడిగారో, అదే చేస్తున్నాను’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నల్లధనంపై యుద్ధం ఈ రోజు, హఠాత్తుగా మొదలైనది కాదని తెలిపారు. ‘‘నేను ఏదీ రహస్యంగా ఉంచలేదు. ప్రజల వద్ద ఏదీ దాచలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పావలా నాణెం రద్దుతో సరిపెట్టిందని... మాకేగనక అధికారమిస్తే వెయ్యి నోట్లు రద్దు చేస్తామని చాలా ఏళ్ల క్రితమే ఓ బహిరంగ సభలో ప్రకటించాను. నల్లధనంపై సిట్‌ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలోనే ఈ విషయాన్ని చెప్పాను. అధికారంలోకి వచ్చీ రాగానే... నల్లధనంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పని చేసే సిట్‌ ఏర్పాటు చేశాం. విదేశాల్లో దాచిన నల్లధనం గుట్టు రట్టు చేయాలని ఆదేశించాం.

గత ప్రభుత్వాలు ఈ పని చేయలేదు’’ అని విమర్శించారు. లంచాల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకే కీలకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘ఆదాయ వెల్లడి పథకం ద్వారా 67 వేల కోట్లు రాబట్టాం. అదే సమయంలో... గత రెండేళ్లలో సోదాలు, సర్వేలు, డిక్లరేషన్ల రూపంలో ప్రభుత్వం 1.25 లక్షల కోట్లు ఖజానాకు జమ చేయగలిగింది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు చిన్న చిన్న డోస్‌లలో ఔషధాన్ని ఇస్తూ వస్తున్నాం’’ అని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులపై బడ్జెట్‌లోనే పన్ను తీసేశామని గుర్తు చేశారు. దేశంలో ఉప్పునకు కొరత ఏర్పడిందన వదంతులపై స్పందిస్తూ... ‘ఇది నల్లధనం పోగొట్టుకుంటున్న వారి పనే’ అని వ్యాఖ్యానించారు.
మోదీ మాట
గంగా నదిలో పుణ్యం కోసం పావలా వేసే వారు... ఇప్పుడు నోట్ల కట్టలు వేస్తున్నారు. ముసలి తల్లి బాగోగులను ఎప్పుడూ పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఆమె ఖాతాలో రెండున్నర లక్షలు జమ చేస్తున్నారు! నల్లధనంపై నా పోరాటానికి మాతృమూర్తుల ఆశీర్వాదముంది. సామాన్యుల ప్రార్థనలున్నాయి. నా ప్రయత్నం విజయానికి ఇవే దోహద పడతాయి.
నగల వ్యాపారులను ఐటీ అధికారులు వేధిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. నేను హామీ ఇస్తున్నా! నగల వర్తకులను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే... మా దృష్టికి తీసుకురండి. కఠిన చర్యలు తీసుకుంటాం!
నగల కొనుగోలుకు ‘పాన్‌’ తప్పనిసరి చేయవద్దని చాలా మంది ఎంపీలు నన్ను అడిగారు. కొందరు లిఖితపూర్వకంగానే కోరారు. ఆ లేఖలను బయటపెట్టిన రోజున... వారు తమ నియోజకవర్గాల్లో తిరగలేరు.
బ్యాంకు సిబ్బందికి నా అభినందనలు. ఏడాదిలో చేసేంత పనిని వారు పది రోజుల్లో చేశారు.
- ప్రధాని నరేంద్ర మోదీ

కోట్లు మింగి వేల కోసం క్యూలో!
రూ.నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు రాహుల్‌ గాంధీ ఇటీవల పార్లమెంటు హౌస్‌లోని బ్యాంకులో క్యూలో నిల్చున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘భారీ కుంభకోణాల్లో ప్రమేయమున్న వారు నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిల్చున్నారు. 500, వెయ్యి నోట్లు ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్‌ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మీరు పావలా నాణేలు రద్దు చేసినప్పుడు మేం ఏమైనా అన్నామా?’’ అని ప్రశ్నించారు.

యుద్ధమంటే మాటలు కాదు!
‘‘ఈ మధ్య ఓ పాత్రికేయుడు నన్ను కలిశారు. యుద్ధం చేద్దామన్నారు. యుద్ధం వల్ల తలెత్తే సమస్యలకు మీ వద్ద పరిష్కారం ఉందా అని నేను ఆయనను ప్రశ్నించాను. సమరంతో విద్యుత్తు ఆగిపోతుంది. సరుకుల సరఫరా నిలిచిపోతుంది. రైళ్లల రద్దవుతాయి. సూచనలు, సలహాలుఇవ్వడం సులభమే. కానీ... మనం తీసుకున్న నిర్ణయాలు సామాన్యుడిని ఇబ్బంది పెట్టవద్దు.’’



‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు రాత్రి కోట్ల మంది ప్రజలు సుఖంగా నిద్రించారు. కానీ, కొన్ని లక్షల మంది అవినీతిపరులకు మాత్రం నిద్ర రాలేదు. వాళ్లంతా నిద్రమాత్రలు వాడాల్సి వచ్చింది.’’

- ప్రధాని మోదీ

No comments: