12/3/16

మన్యం పులి


మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ గురించి తెలియ‌ని తెలుగు ప్రేక్షకులు ఉండ‌క‌పోవ‌చ్చు. విల‌క్షణ న‌టుడుగా ఎన్నో పాత్రల్లో మెప్పించిన మోహ‌న్‌లాల్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా న‌టిస్తున్నారు. ఈ ఏడాది ఆయ‌న న‌టించిన మ‌నమంతా, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాలు ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందిన‌వే. మోహ‌న్‌లాల్‌కు తెలుగులో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రేజ్ దృష్ట్యా మోహ‌న్‌లాల్ నటించిన పులిమురుగ‌న్ సినిమాను తెలుగులో మ‌న్యం పులి అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. మ‌ల‌యాళంలో వంద కోట్ల‌కు పైగా క‌లెక్షన్స్‌తో స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసిన పులిమురుగ‌న్ తెలుగులో మ‌న్యంపులిగా ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చుకుంటుందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..


క‌థ‌:
పులియూర్ మ‌న్యం ప్రాంతం. అక్కడ పులులు సంచ‌రిస్తుంటాయి. ఓ పులి భారిన ప‌డి వాటి కార‌ణంగా కుమార్ (మోహ‌న్‌లాల్‌) తండ్రిని కోల్పోతాడు. అత‌ని చిన్నప్పుడే త‌ల్లి కూడా చ‌నిపోతుంది. త‌న త‌మ్ముడు మ‌ణిని కూడా అత‌డే పెంచి పెద్ద చేస్తాడు. త‌న తండ్రిని చంపిన పులిని త‌న బావ సాయంతో మ‌ట్టుబెడ‌తాడు. అప్పటి నుంచి పులిని వేటాడ‌టంలో ఆరితేరుతాడు. అనాథ అయిన అమ్మాయి మైనా (క‌మ‌లిని ముఖ‌ర్జీ)ని పెళ్లాడుతాడు. వాళ్ల‌కి చిన్ని అనే పాప కూడా ఉంటుంది. అనుకోకుండా పాత విరోధం ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కిశోర్‌)తో కుమార్‌కి గొడ‌వ‌లు మ‌ర‌లా తిర‌గ‌బెడుతాయి. దాంతో ఫారెస్ట్ ఆఫీస‌ర్ నుంచి అత‌నికి ఇబ్బందులు మొద‌ల‌వుతాయి.

స‌రిగా అదే స‌మ‌యంలో మ‌ణి స్నేహితులు ఇద్ద‌రు క‌లిసి కుమార్ కుటుంబాన్ని సిటీకి తీసుకెళ్తారు. అక్క‌డ డాడీ గిరిజ (జ‌గ‌ప‌తిబాబు) ద‌గ్గ‌ర ప‌ని ఇప్పిస్తారు. సెకండాఫ్‌లో డాడీ గిరిజ పులియూర్‌లో కుమార్ కోసం తిరుగుతుంటాడు. కుమార్ ని చంపాల‌ని ప్రయ‌త్నం చేస్తాడు. డాడీ గిరిజ‌కు, కుమార్‌కు అంత వైరం ఎందుకు వ‌చ్చింది? మ‌ణి ప‌రిస్థితి ఏంటి? డాడీ గిరిజ అస‌లు ఎవ‌రు? మ‌ధ్యలో జూలీ (న‌మిత‌)కి కుమార్‌తో ఉన్న సంబంధం ఏంటి? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.


ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్లు చాలానే ఉన్నాయి. మ‌న్యం పులి అనే టైటిల్‌కు త‌గ్గట్టు ఈ సినిమా స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేసింది మోహ‌న్‌లాల్ న‌ట‌న‌. అతి త‌క్కువ మేక‌ప్‌తో అడ‌వుల్లో పెరిగిన అమ్మాయిలాగా చ‌క్కగా న‌టించింది క‌మ‌లిని. ఎస్టేట్ ఓన‌ర్ కూతురిగా, స్థానిక యువ‌కుడిపై క‌న్నేసిన పాత్రలో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించే ప్రయ‌త్నం చేసింది న‌మిత‌. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ గా కిశోర్ న‌ట‌న‌, డాడీ గిరిజ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు చాలా బాగా మెప్పించారు. ఖాద‌ర్‌గా, మేస్త్రీగా, కుమార్ బావ‌గా చేసిన న‌టుల పెర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుంది.

తెర‌మీద పులి కనిపించ‌గానే వ‌చ్చే స‌న్నివేశాలు చాలా బావుంటాయి. ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. గోపీసుంద‌ర్ సంగీతంలో పాట‌లు బావున్నాయి. నేప‌థ్య సంగీతం కూడా చాలా బావుంది. లొకేష‌న్లు ప‌చ్చపచ్చగా క‌ళ్లకు ఆహ్లాద‌క‌రంగా ఉన్నాయి. పీట‌ర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్లు సినిమాకు ప్రత్యేక ఆక‌ర్షణ‌. చిన్న పిల్ల‌ల‌కు పులి ఎపిసోడ్స్ త‌ప్పకుండా నచ్చి తీరుతాయి. పులితో ఫైట్ చేసే స‌మ‌యంలో మోహన్‌లాల్ ఫేస్ ఎక్స్ ప్రెష‌న్స్, అతను ప‌న్నే వ్యూహాలు బిగ్ స్క్రీన్ మీద బావున్నాయి.


మైన‌స్ పాయింట్లు
అడ‌విలో చిన్న గుడారంలో క‌థ‌లు తెలుగు ప్రేక్షకుల‌కు కొత్త కాదు. క‌థ‌నం కూడా గొప్పగా ఏమీ లేదు. సినిమాలో కామెడీ పెద్దగా లేదు. న‌మిత పాత్రను చూసి క‌మ‌లిని ముఖ‌ర్జీ ఉడుక్కునే స‌న్నివేశాలు పెద్దగా మెప్పించ‌వు. ఆడ‌వాళ్లు స్నానం చేస్తుంటే చూసే వీక్‌నెస్ ఉన్న క‌మెడియ‌న్ పాత్ర ఎబ్బెట్టుగా ఉంటుంది. హీరో త‌మ్ముడి పాత్రను ఇంకాస్త మెరుగ్గా మ‌ల‌చి ఉంటే బావుండేదేమో. నిడివి బాగా ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది.


స‌మీక్ష
ఈ త‌ర‌హా సినిమా తెలుగు తెర‌పై క‌నిపించి చాన్నాళ్ల‌యింది. అనువాద సినిమా అయిన‌ప్పటికీ ఈ సినిమా చూడ్డానికి బావుంది. మోహ‌న్‌లాల్ ఈ వ‌య‌సులో పులితో చేసే రోప్ ఫైట్లు రోమాంఛితుల్ని చేస్తాయి. క‌మ‌లిని మేక‌ప్ లేకుండా పిల్ల త‌ల్లిగా చాలా నేచుర‌ల్‌గా క‌నిపించింది. జ‌గ‌ప‌తిబాబు పాత్ర కూడా బావుంది. ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా గ్రే లుక్స్ తో జ‌గ‌ప‌తిబాబు త‌న‌వంతు న్యాయం చేశారు.

ఓ స‌న్నివేశంలో మోహ‌న్‌లాల్ వ‌చ్చి జ‌గ‌ప‌తిబాబు కాళ్లు ప‌డ‌తాడు. మ‌రో స‌న్నివేశంలో మోహ‌న్‌లాల్‌ని క‌మ‌లిని ముఖ‌ర్జీ కాలుతో త‌న్నుతుంది. అంత పెద్ద స్టార్ త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న‌పెట్టి చేసిన స‌న్నివేశాలు ఆయా సంద‌ర్భాల‌లో స‌న్నివేశాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. చిన్న పిల్ల‌లు పులితో మోహ‌న్‌లాల్ చేసే యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. మ‌ల‌యాళ న‌టుడైన‌ప్ప‌టికీ మోహ‌న్‌లాల్ ఇటీవ‌ల `మ‌న‌మంతా`, `జ‌న‌తాగ్యారేజ్‌` చిత్రాల‌తో తెలుగువారికి బాగా ద‌గ్గర‌య్యారు. అది కూడా ఈ సినిమాకు హెల్ప్ అవుతుంద‌ని అనుకోవ‌చ్చు.


బాట‌మ్ లైన్‌: ఈ సినిమాకు బ‌లం `మోహ‌న్‌లాల్ +పులి`
రేటింగ్‌: 3/5

No comments: