11/24/16

హైదరాబాద్ లో సినిమాల్లో ఛాన్స్ అంటూ...చిక్కిన మోసగాడు

సైబరాబాద్‌ పరిధిలో అమాయక యువతులను మోసం చేసి.. బెదిరించి వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదిస్తున్న ముఠా నాయకుడిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌జోన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సుమతి వివరాలు వెల్లడించారు. బోరబండ వినాయక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ గంపుల శివకుమార్‌ అలియాస్‌ పంజాగుట్ట శివ కర్నూలు నివాసి. బతుకుదెరువు కోసం 2007లో నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. పంజాగుట్టలో చిన్న చిన్న హోటళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. పనిచేసే చోట వ్యభిచారం నిర్వహించే రాజు అనే వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. హోటల్‌లో పనిచేయడం మానేసి రాజు వద్దే ఉంటున్నాడు. యువతులకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపి లాడ్జీలకు పంపించడంతో వచ్చే కమీషన్‌ డబ్బు వసూలు చేసేందుకు శివకుమార్‌ మధ్యవర్తిగా ఉన్నాడు. డబ్బు సంపాదించాలన్న ఆశతో రాజును హత్య చేయాలని పథకం వేశాడు. నలుగురు స్నేహితులతో కలిసి కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో రాజును దారుణంగా హత్య చేశారు. కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పులేదు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో లాడ్జీలకు యువతులను పంపించి కమీషన్‌ వసూలు చేస్తున్నాడు. పంజగుట్ట, గోపాలపురం, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో అతడిపై గతంలో కేసులున్నాయని డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి సిమ్‌ కార్డులు, సెల్‌ఫోన్లు, రెండువేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని
చెప్పారు. 



ప్రజ్వల సంస్థ డైరెక్టర్‌ ఫిర్యాదుతో...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలలోని జిల్లాల నుంచి సినిమాల అవకాశం, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే యువతులను శివకుమార్‌ టార్గెట్‌ చేసి వ్యభిచారంలోకి దింపుతున్నాడని ప్రజ్వల సంస్థ డైరెక్టర్‌ సునీతా కృష్ణన్‌ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నా బంగారుతల్లి' చిత్రానికి నిర్మాతగా ఉన్న సునీతా కృష్ణన్‌‌కు నేషనల్ అవార్డ్ తీసుకున్న విషయం తెలిసిందే. మహంకాళి ఏసీపీ గంగాధర్‌, బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ జానకమ్మ, గోపాలపురం సీఐ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. బోరబండలోని ఇంట్లో శివకుమార్‌ ఉన్నాడని వారికి బుధవారం సమాచారం అందగా.. అక్కడికెళ్లి అతడిని పట్టుకున్నారు. ఓ హత్య సహా ఎనిమిది కేసుల్లో నిందితుడని.. పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని డీసీపీ చెప్పారు. అతడి అనుచరులు అడ్డగుట్టకు చెందిన జగదీష్‌, ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన జాదవ్‌ రాహుల్‌, ఎం. కృష్ణవేణి, పద్మ, మోండా మార్కెట్‌ గ్యాస్‌మండికి చెందిన గాలపల్లి శివానంద్‌ను కొద్దిరోజుల క్రితమే అరెస్టు చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు. వీరందరికీ శివకుమార్‌ బాస్‌ అని తెలిపారు.


లాడ్జీలపై కేసులు
వ్యభిచారం నిర్వహిస్తున్న సికింద్రాబాద్‌లోని లాడ్జీలపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. శివకుమార్‌ రెండేళ్ల నుంచి యువతులను లాడ్జీలకు పంపించేవాడని దర్యాప్తులో తేలిందన్నారు.

No comments: